న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు (సోమవారం) వైట్‌హౌస్ విడుదల చేసిన ఓ పత్రంలో భారత్‌ను ట్రంప్ ప్రభుత్వంతో 'కొత్త, మెరుగైన వాణిజ్య ఒప్పందాలు' కుదుర్చుకున్న దేశాల జాబితాలో చేర్చింది. 'అధ్యక్షుడు ట్రంప్ రెండో టర్మ్: ఇచ్చిన హామీలు, నిలబెట్టుకున్న హామీలు' పేరుతో విడుదలైన ఈ పత్రంలో 127 హామీలను నెరవేర్చినట్లు పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీలో సగానికి పైగా వాటా ఉన్న దేశాలతో టారిఫ్‌ల ద్వారా కొత్త ఒప్పందాలు సాధించినట్లు వెల్లడించారు.
జాబితాలోని ఇతర దేశాలు
యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, కంబోడియా.
భారత్ ఒప్పందం అసలు స్థితి
- ఫిబ్రవరి 6న ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన 'ఫ్రేమ్‌వర్క్'ను మాత్రమే ప్రకటించాయి.. ఒప్పందంపై ఇంకా సంతకాలు జరగలేదు
- ఫ్రేమ్‌వర్క్ ప్రకారం అమెరికా పారిశ్రామిక వస్తువులు, పలు వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు తొలగించడం లేదా తగ్గించడం
- భారత వస్తువులపై అమెరికా 18% ప్రతీకార సుంకం విధించాలన్నది ప్రతిపాదన
- ఒప్పందం పూర్తయితే జనరిక్ ఔషధాలు, వజ్రాలు, ఆభరణాలు, విమాన విడిభాగాలపై ప్రతీకార సుంకం తొలగింపు
తొలి విడత ఒప్పందం ఖరారైందని, ప్రస్తుతం న్యాయపరమైన ముసాయిదా దశలో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 15న తెలిపారు. న్యాయ పరిశీలన పూర్తయ్యాక సంతకాలు చేసి అమలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే ఇందుకు నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు.







