ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) వ్యవహారంలో ఇండియా కూటమి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ యేటూరు తదితరులను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం దరఖాస్తు దాఖలు చేశాయి. ఇందుకోసం 48 ప్రశ్నలతో కూడిన జాబితాను కోర్టుకు సమర్పించాయి.
నేడు విచారణ
ఎస్ఐఆర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. అక్టోబర్ 27న జరిగిన గత విచారణలో ఈసీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు ధర్మాసనం పది రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మంగళవారానికి ఖరారు చేసింది.
48 ప్రశ్నల్లో ప్రధాన అంశాలు
- నిర్ణయాలు ఎలా? ఎస్ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకున్నారా? ఎప్పుడు ఆమోదించారు? ఎవరు అనుమతించారు? ఏ సభ్యుడైనా అభ్యంతరం చెప్పారా?
- దేశవ్యాప్త ఎస్ఐఆర్: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించాలన్న నిర్ణయం ఎప్పుడు, ఏ ప్రక్రియలో తీసుకున్నారు? ఫైల్ నంబర్లు, ఆమోద తేదీలు ఏమిటి? సమావేశాల్లో తీసుకున్నారా, సర్క్యులేషన్ ద్వారా తీసుకున్నారా?
- కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు: 2025 ఫిబ్రవరి 19 నుంచి ఎస్ఐఆర్, ఈసీఐనెట్, ఫారం–6, అప్పీళ్ల విషయంలో కమిషనర్లు సంధు, జోషి ఎన్నిసార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు తెలిపారు?
- మెజారిటీ ఓటింగ్: 2023 చట్టంలోని సెక్షన్ 18(2) కింద ఏదైనా నిర్ణయం మెజారిటీ ఓటుతో తీసుకున్నారా? అసమ్మతి తెలిపింది ఎవరు?
- ఓటర్ల డేటాబేస్: ఓటర్ల వివరాలను చేర్చడం, తొలగించడం, మార్చడం, పునరుద్ధరించే అధికారం ఎవరికి ఉంది? ప్రైవేట్ వెండర్లు, కాంట్రాక్టర్లకు ఆ యాక్సెస్ ఉందా?
- ఈసీఐనెట్ ఆడిట్: ప్రతి మార్పుకూ యూజర్ ఖాతా, తేదీ, సమయం నమోదవుతున్నాయా?
- ఆన్‌లైన్ ఫారం–6: డిక్లరేషన్ నిబంధన ఎలా వచ్చింది? డిక్లరేషన్, మ్యాపింగ్ వివరాలు లేవన్న కారణంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరించారు?
- పశ్చిమ బెంగాల్ అప్పీళ్లు: జ్యుడీషియల్ అధికారుల ఉత్తర్వులపై ఎన్ని అప్పీళ్లు దాఖలు చేశారు? వాటిని ఎవరు అనుమతించారు?
ఈసీఐ వాదన ఏమిటి?
ఎస్ఐఆర్‌కు సంబంధించిన మూడు ప్రధాన నిర్ణయాలూ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు సమర్పించిన సమాధానంలో పేర్కొంది. అయితే ఈసీఐ ఎలాంటి పత్రాలు, రికార్డులు చూపకుండానే ఈ ప్రకటనలు చేసిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. అధికారిక పత్రాలు తమకు స్వతంత్రంగా అందుబాటులో లేనందున, అధికారులను ప్రశ్నించడం ద్వారానే సమాధానాలకు ఆధారాలు లభిస్తాయని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ నిర్ణయంపై సమాచారం లేదని ఈసీఐ చెప్పిందని, కానీ 2025 నాటి ఉత్తర్వులో మాత్రం ఎస్ఐఆర్ అవసరమని పేర్కొందని పిటిషనర్లు వైరుధ్యాన్ని ఎత్తిచూపారు.







