న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకుల భారం మొత్తాన్ని దేశ ప్రజలు, రైతులపై మోపబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా డీజిల్ ధరను లీటరుకు కనీసం రూ.50 పెంచాల్సిన పరిస్థితి వచ్చినా, ప్రభుత్వం కేవలం రూ.7 మాత్రమే పెంచిందని, మిగిలిన రూ.43 భారాన్ని తానే భరించిందని తెలిపారు. ఇండియా టుడే గ్రూప్‌కు చెందిన కిసాన్ తక్ దిల్లీలోని భారత్ మండపంలో గురువారం నిర్వహించిన ‘భారత్ వ్యవసాయ సదస్సు 2026’లో ఆయన ప్రసంగించారు.
122 డాలర్లకు ముడిచమురు
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల కారణంగా కొన్ని వారాల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు ఎగబాకిందని ప్రధాని గుర్తుచేశారు. ఇది భారత్‌కు పెద్ద సవాలుగా మారిందన్నారు. ‘‘ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు కనీసం రూ.50 పెంచాల్సి వచ్చింది. కానీ రూ.7 మాత్రమే పెంచి, మిగతా రూ.43 భారాన్ని ప్రభుత్వమే మోసింది’’ అని చెప్పారు. పొరుగు దేశాల్లో డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం పెరిగినా భారత్‌లో అలా జరగనివ్వలేదన్నారు. అప్పటి నుంచి ప్రతి నెలా రూ.14 వేల కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో ఎరువుల ధరలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
వ్యవసాయం లేకుండా వికసిత భారత్ అసాధ్యం
వ్యవసాయం కేవలం ఆర్థిక రంగం మాత్రమే కాదని, దేశ ప్రగతి, సంస్కృతి, సామాజిక జీవనానికి అదే కేంద్రబిందువని ప్రధాని అన్నారు. ‘‘వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా, సాగును స్మార్ట్‌గా మార్చకుండా, రైతులను బలోపేతం చేయకుండా వికసిత భారత్‌ను నిర్మించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించిన వికసిత భారత్ ఏడు బలాల్లో వ్యవసాయం ఒకటని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఏటా 4 శాతానికి పైగా వృద్ధి సాధించిన తొలి దశాబ్దం ఇదేనని చెప్పారు.







