వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఉన్న ఇరాన్‌కు చెందిన కెష్మ్ దీవిపై అమెరికా సైన్యం సోమవారం దాడులు చేసినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కొన్ని వారాల విరామం తర్వాత జరిగిన ఈ దాడులతో దీవిలో పలు పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

ముఖ్యాంశాలు

  • అమెరికా ఆస్తులపై ఇరాన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా చేపట్టిన రక్షణాత్మక చర్య అని అమెరికా అధికారులు పేర్కొన్నారు
  • వాణిజ్య నౌకల రక్షణ కోసం చేపట్టిన పరిమిత ఆపరేషన్ అని అమెరికా ప్రకటించింది
  • అమెరికాకు చెందిన రెండు డ్రోన్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది
  • గత కొన్ని వారాలుగా అమెరికా రహస్యంగా, పరిమిత స్థాయిలో దాడులు చేస్తోందని నివేదికలు

చమురు ధరలపై ప్రభావం

ఈ వార్తతో ఆసియా మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 105.25 డాలర్లకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 0.5 శాతం పెరిగి 96.93 డాలర్లకు చేరింది. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాకు దీర్ఘకాలం అంతరాయం కలుగుతుందన్న ఆందోళనలు పెరిగాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో అధిక భాగం ఈ మార్గం గుండానే వస్తుంది.

అంతకుముందు సోమవారం అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు చేస్తారా అన్న ప్రశ్నకు 'లేదు' అని సమాధానమిచ్చారు. యుద్ధం ముగింపు కోసం ఖతార్ మధ్యవర్తులు కొత్త ప్రతిపాదనతో టెహ్రాన్‌కు వెళ్లినట్లు సమాచారం.