న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మైక్రోసాఫ్ట్ 365 సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. ఔట్‌లుక్ ఈమెయిల్, టీమ్స్, ఏఐ అసిస్టెంట్ కోపైలట్ సహా పలు సేవలు నిలిచిపోవడంతో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అమెరికా కాలమానం ప్రకారం గురువారం (నవంబర్ 12) మొదలైన ఈ సమస్య శుక్రవారం వరకు కొనసాగింది. సంస్థ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతరాయాల్లో ఒకటిగా ఇది 12 గంటలకు పైగా కొనసాగిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
గంటలోనే 74 దేశాలకు
సమస్య మొదలైన గంట వ్యవధిలోనే 74 దేశాలు, ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని ఔటేజ్ ట్రాకింగ్ సంస్థ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. ఒక్క అమెరికాలోనే ఔట్‌లుక్‌పై ఫిర్యాదులు గరిష్ఠంగా 1.3 లక్షలు దాటాయి. తర్వాత ఫిర్యాదులు క్రమంగా తగ్గి, అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 37 వేలకు చేరాయి. చాలా మంది వినియోగదారులు తమ మెయిల్‌బాక్స్‌లు తెరవలేకపోయారు, ఈమెయిళ్లు పంపలేకపోయారు. టీమ్స్‌లో చాట్‌లు, కాల్స్ చాలావరకు పనిచేసినప్పటికీ క్యాలెండర్ సేవలు, కోపైలట్ తదితర ఫీచర్లు దెబ్బతిన్నాయి.
కారణం ఏంటి?
మౌలిక వ్యవస్థపై అనూహ్యంగా పెరిగిన లోడ్ (ఎలివేటెడ్ లోడ్) వల్లే ఈ సమస్య తలెత్తిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ మౌలిక వ్యవస్థలో కొన్ని సర్వర్లు అనుకోకుండా స్పందించడం మానేయడంతో, మిగిలిన సర్వర్లపై భారం పెరిగింది. సురక్షిత కనెక్షన్లను నిర్వహించే ఒక ప్రక్రియపై అధిక ఒత్తిడి పడినట్లు సంస్థ దర్యాప్తులో తేలింది. పునఃప్రారంభించిన కొన్ని సర్వర్లు ట్రాఫిక్ తిరిగి రాగానే మళ్లీ విఫలమయ్యాయి. దీంతో తొలి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.







