ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజధాని కైరోకు దక్షిణాన సుమారు 52 కిలోమీటర్ల దూరంలోని గిజా ప్రావిన్స్, అల్-అయ్యత్ జిల్లాలో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారని ఈజిప్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. మృతుల్లో రైలు కండక్టర్ కూడా ఉన్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
- నైరుతి ఫయూమ్ ప్రావిన్స్‌కు వెళ్తున్న గిజా–ఫయూమ్ రైలు, దక్షిణ అస్వాన్‌కు వెళ్తున్న కైరో–అస్వాన్ రైలు చివరి బోగీని వెనుక నుంచి ఢీకొట్టింది.
- అస్వాన్ రైలు అదే ట్రాక్‌పై, అదే దిశలో ఆగి ఉందని ప్రాథమిక పరిశీలనలో తేలింది.
- ఆగి ఉన్న రైలు బోగీలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులు బయటకు తీసేసరికే మృతి చెందారు.
సహాయక చర్యలు
సమీప గ్రామస్థులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్సులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల తొలగింపునకు అత్యవసర బృందాలు, క్రేన్లను పంపినట్లు, త్వరలో రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని ఈజిప్ట్ రైల్వే అథారిటీ తెలిపింది.
దర్యాప్తుకు ఆదేశం
ప్రమాదంపై తక్షణ దర్యాప్తు చేపట్టాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆదేశించారు. ప్రాసిక్యూటర్ బృందాలు ఘటనాస్థలిని పరిశీలించాయి. నిర్వహణ లోపాలు, పాత పరికరాల కారణంగా ఈజిప్ట్‌లో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గత సెప్టెంబర్‌లో ఇదే జిల్లాలో రెండు సరకు రవాణా రైళ్లు ఢీకొన్నాయి. 2002లో రైలులో మంటలు చెలరేగి 300 మందికి పైగా మరణించిన ఘటన ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఘోర రైలు ప్రమాదం.







