సాయుధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్లకు రెండేళ్ల "సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ"కి ఆమోదం తెలిపింది. దీంతో ఆసక్తి ఉన్న ప్రతి అగ్నివీర్ మరో రెండేళ్లు సైన్యంలో సేవలందించే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
కొత్త విధానంలో ఏం మారింది?
- మెరిట్ ఆధారంగా 25 శాతం మందిని నేరుగా రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే నిబంధన యథాతథంగా కొనసాగుతుంది.
- మిగిలిన 75 శాతం మందికి ఆసక్తి, దళాల సిఫార్సు ఆధారంగా అదనంగా రెండేళ్ల సర్వీసు ఇస్తారు.
- ఈ రెండేళ్లు పూర్తయ్యాక, నిర్దేశిత ఎంపిక ప్రమాణాలు అందుకున్న అగ్నివీర్లందరికీ రెగ్యులర్ సైనికులుగా చేరే అవకాశం కల్పిస్తారు.
- మొత్తం సర్వీసు కాలం ఆరేళ్లకు చేరుతుంది.
వేతనం ఎంత?
తొలి నాలుగేళ్లలో నెలకు ₹30,000 నుంచి ₹40,000 వరకు వేతనం ఉండగా, పొడిగించిన రెండేళ్లలో మొదటి ఏడాది ₹43,500, రెండో ఏడాది ₹47,500 చొప్పున అందుతుంది.
అగ్నిపథ్ శిలాశాసనం కాదు: సీడీఎస్
నాలుగేళ్లుగా ఏటా అగ్నివీర్ల పనితీరును సమీక్షించామని, ఆ తర్వాతే రెండేళ్ల పొడిగింపు అవసరమన్న నిర్ణయానికి వచ్చామని త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు. అగ్నివీర్ల శారీరక దృఢత్వం, ప్రేరణ, సాంకేతిక నైపుణ్యాలపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. అగ్నిపథ్ పథకాన్ని మార్పులకు వీలున్న విధంగానే రూపొందించామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.







