న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) కొత్త అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే వారి తొలి అధికారిక సమావేశం. దీక్షిత్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న విశిష్ట వైమానిక యోధుడని ప్రశంసిస్తూ రాజ్‌నాథ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

బాధ్యతల స్వీకరణ

42 ఏళ్ల సేవల అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయడంతో, అశుతోష్ దీక్షిత్ అక్టోబర్ 31న 29వ వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన జూలై 1 నుంచి వాయుసేన వైస్ చీఫ్‌గా ఉన్నారు.

అశుతోష్ దీక్షిత్ ప్రస్థానం

  • 1986 డిసెంబర్ 6న ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో నియామకం
  • ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్.. 3,300 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం
  • మిరాజ్-2000, మిగ్ రకాలు, జాగ్వార్, తేజస్, హాక్ విమానాలు నడిపిన అనుభవం
  • మిరాజ్-2000 స్క్వాడ్రన్, బీదర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు కమాండర్‌గా సేవలు
  • సెంట్రల్ ఎయిర్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు