గడ్చిరోలి (మహారాష్ట్ర): శాంతికి, కొత్త ఆశలకు ప్రతీకగా గడ్చిరోలి పోలీసులు ఆదివారం 'మావోయిస్ట్ రహిత దీపావళి' పేరుతో జిల్లావ్యాప్తంగా గ్రామస్తులు, భద్రతా సిబ్బందితో కలిసి పండుగ జరుపుకున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మారుమూల బినగుండ గ్రామంలో కొత్త భద్రతా వాతావరణంలో తొలిసారిగా దీపావళి వేడుకలు జరగడం విశేషం.
70 కేంద్రాల్లో వేడుకలు
ఎస్పీ ఎం. రమేశ్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని మొత్తం 70 పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టులు, పోలీస్ సహాయ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ అధికారులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి స్థానికులకు మిఠాయిలు, టపాసులు పంచి పోలీసులు–ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేశారు. గర్దేవాడ, పెంధ్రి, జిమల్‌గట్టాల్లోనూ ఇదే తరహా వేడుకలు జరిగాయి.
'ఆపరేషన్ అంతిమ్ ప్రహార్'తో మార్పు
బినగుండ పోలీస్ సహాయ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ రమేశ్, 2026 జనవరిలో బినగుండ సాయుధ ఔట్‌పోస్టు ఏర్పాటు, మే నెలలో చేపట్టిన 'ఆపరేషన్ అంతిమ్ ప్రహార్' విజయం జిల్లాలో మావోయిస్టుల ప్రభావాన్ని తుడిచిపెట్టడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఒకప్పుడు ఈ అడవుల్లో మావోయిస్టుల భయం, తుపాకుల మోత ఉండేదని, 40 ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు దీపావళి టపాసుల శబ్దం వినిపిస్తోందని ఆయన అన్నారు.







