న్యూఢిల్లీ: శీతాకాలం మొదలవుతుండటంతో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు నగర సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 307కు చేరి 'అతి పేలవం' (వెరీ పూర్) కేటగిరీలోకి వెళ్లింది. ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యధికం.
ఎక్కడ ఎంత?
- జహంగీర్‌పురి – 417 (రాజధానిలో అత్యధికం)
- ఐటీవో – 351, ఇండియా గేట్/జన్‌పథ్ పరిసరాలు – 335, అశోక్ విహార్ – 327
- నోయిడా – 308; ఘాజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ కూడా 'పేలవం' లేదా 'అతి పేలవం'
- 58 పర్యవేక్షణ కేంద్రాల్లో 37 చోట్ల 'అతి పేలవం' లేదా అంతకంటే దారుణ స్థాయి
అమల్లోకి శీతాకాల ఆంక్షలు
ఢిల్లీ ప్రభుత్వ 'వింటర్ యాక్షన్ ప్లాన్'లో భాగంగా అదనపు కాలుష్య నియంత్రణ చర్యలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతాయి. బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ స్థాయి ఉన్న ఢిల్లీ వెలుపలి వాహనాలను జనవరి 31 వరకు నగరంలోకి అనుమతించరు. తొలిరోజే సుమారు 1,539 వాహనాలను సరిహద్దుల నుంచి వెనక్కి పంపి, మొత్తం రూ.68 లక్షలకు పైగా జరిమానాలు విధించారు.
ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా సహా ఐదు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నవంబర్ 5 నుంచి 20 వరకు 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఆదేశించింది. శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, పిల్లలు బయటి కార్యకలాపాలు తగ్గించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.







