రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో వైరల్ జ్వరాలు, ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న హెచ్1ఎన్1 స్ట్రెయిన్ తీవ్రమైన లక్షణాలతో కనిపిస్తోంది. మందులు వాడినా తగ్గని అధిక జ్వరం, వారం రోజులపాటు కొనసాగే విపరీతమైన దగ్గు, భ్రాంతి స్థాయికి చేరే జ్వర తీవ్రత, పిల్లల్లో ఫిట్స్ రావడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 75 శాతానికి పడిపోవడం వంటి తీవ్ర లక్షణాలు నమోదవుతున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లూయెంజా, సారి (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్), ఐఎల్‌ఐ (ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్‌నెస్), హెచ్1ఎన్1 కేసులు పెరగడంతో ఆ ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, జ్వరం తగ్గకపోవడం, గందరగోళం, తీవ్ర నీరసం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ముందుజాగ్రత్తగా వార్షిక వ్యాక్సినేషన్ తీసుకోవాలని, పరీక్ష ఫలితాల కోసం ఆలస్యం చేయకుండా ముందుగానే వైద్యులను కలవాలని వారు కోరుతున్నారు.