హైదరాబాద్: తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీపై నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో సీఎం ఆదేశాలు

  • బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి.
  • గతంలో కుదిరిన ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్రకు అందించాలి.
  • మహారాష్ట్ర అధికారులు కోరే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలి.

పరిహారానికి సిద్ధం

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. భూముల ముంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశం. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం, సాగునీటి కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది.