హైదరాబాద్: నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఆహార భద్రత ప్రమాణాలు గాలికొదిలేసిన ఘటనలు వెలుగుచూశాయి. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు గోల్కొండ, చార్మినార్ జోన్లలో 22 రెస్టారెంట్లను తనిఖీ చేసి.. 14 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.
లైసెన్సులు రద్దయిన వాటిలో కొన్ని
- హోటల్ నయాబ్ (నయాపూల్), షా గౌస్ కేఫ్ (షాలిబండ)
- సిద్ధిఖీ కబాబ్ సెంట్రల్ కిచెన్, శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా (గుడిమల్కాపూర్)
- సోహైల్ రెస్టారెంట్, హోటల్ అక్షయ టిఫిన్స్ (మలక్‌పేట), మెహ్ఫిల్ రెస్టారెంట్ (దిల్‌సుఖ్‌నగర్)
- లక్కీ రెస్టారెంట్ (సంతోష్ నగర్), అల్సాబా హోటల్ (టోలిచౌకి), డైన్ హిల్ రెస్టారెంట్ (మాసబ్ ట్యాంక్)
తనిఖీల్లో బయటపడ్డ దారుణాలు
ఓ సెంట్రల్ కిచెన్‌లో వంటగదిలో పిల్లులు తిరుగుతుండగా, ఎలుకల మలం, ఈగల బెడద కనిపించింది. చీపుర్లు, చెప్పుల పక్కనే బకెట్లలో గ్రేవీలు నిల్వ చేశారు. మరో రెస్టారెంట్‌లో తాగునీటి ట్యాంకులో బొద్దింకలు కనిపించాయి. హోటల్ నయాబ్‌లో ఆహార పదార్థాలపై న్యూస్‌పేపర్లు కప్పడం, బిర్యానీ తయారీ ప్రాంతంలో నిల్వ నీరు, వండిన గ్రేవీల పక్కనే పచ్చి మాంసం ఉంచడం గుర్తించారు. షా గౌస్ కేఫ్‌లో కుళ్లిన పండ్లు, గడువు ముగిసిన ఉత్పత్తులు లభ్యమయ్యాయి.
మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించిన అధికారులు 544 కిలోల పాడైన ఆహారం, కూరగాయలు, 13 కిలోల పదేపదే వాడిన వంట నూనెను ధ్వంసం చేశారు. పిస్తా హౌస్ (షాలిబండ), తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ సహా ఎనిమిది సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు.







