హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటిన మురసు తుపాను ప్రభావం తెలంగాణపైనా పడుతోంది. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

జిల్లాల వారీగా హెచ్చరికలు

  • రెడ్ అలర్ట్: నల్గొండ, నాగర్‌కర్నూల్
  • ఆరెంజ్ అలర్ట్: సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి
  • వర్షాలు కురిసే అవకాశం: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల

మంత్రి తుమ్మల సమీక్ష

తుపాను ప్రభావంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోతకు వచ్చిన వరి, పత్తి పంటలను కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.