హైదరాబాద్/రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 10న జరిగిన దాడిలో గాయపడిన తెలంగాణ వాసి మహమ్మద్ ఫజల్ పాషా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయంలో వీల్‌చైర్‌లో ఉన్న ఆయన ఫొటోను భారత రాయబార కార్యాలయం పంచుకుంది.
అండగా నిలిచిన భారత ఎంబసీ
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఫజల్ పాషా చికిత్సను, కోలుకునే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించింది. ఆసుపత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, డిశ్చార్జ్ అనంతరం ఆయన స్వదేశానికి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. "ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం" అని ఎంబసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే దాడిలో మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
సౌదీలోని భారతీయులకు సూచనలు
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో భద్రతా ఆందోళనలు పెరగడంతో, సౌదీ అధికారులు జారీ చేసే అత్యవసర సూచనలను పాటించాలని భారత ఎంబసీ అక్టోబర్ 18న అక్కడి భారతీయులకు సూచించింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల నిలిపివేతను అక్టోబర్ 24 వరకు పొడిగించాయి. ప్రయాణికులకు రీబుకింగ్, రీఫండ్ అవకాశాలు కల్పించాయి.







