హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను 2028 నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్న పోలీస్ అమరవీరుల స్మారకం వద్ద నిర్వహించిన పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
మాటల్లో చెప్పలేని త్యాగాలు
విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న త్యాగాలను మాటల్లో వర్ణించలేమని సీఎం అన్నారు. 1959 అక్టోబర్ 21న లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద ఇండో-టిబెట్ సరిహద్దును కాపలా కాస్తున్న పది మంది భారత పోలీసులు చైనా సైనికుల మెరుపుదాడిలో ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు.
రాష్ట్ర అమరవీరులకు ఘన నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ పోలీసులు ఏఎస్ఐ దేవ్ సింగ్, కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్, శీలం కమలాకర్, కానిస్టేబుల్ గాజుల సౌమ్యలకు ముఖ్యమంత్రి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







