హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

సీఎం ఆదేశాలు

  • నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చూడాలి.. చెత్త సేకరణను నిరంతరం పర్యవేక్షించాలి
  • ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి నగరాన్ని ట్రాఫిక్ రహితంగా మార్చాలి
  • సిగ్నల్ రహిత వ్యవస్థ కోసం అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళికలు రూపొందించాలి
  • మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నీటిని నిర్మాణాలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, తోటల పెంపకానికి వాడేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి

'గ్రీన్ ట్యాంకర్లు'

తొలి దశలో 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్లతో జలమండలి శుద్ధి చేసిన నీటి సరఫరా ప్రారంభించింది. ఈ సేవలను జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధులకు విస్తరించాలని సీఎం సూచించారు.

సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.