జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో నమీబియా, జింబాబ్వే జట్లు ఫైనల్‌కు చేరుకుని 2026 ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. సెమీఫైనల్‌లో టాంజానియాపై 63 పరుగుల తేడాతో నమీబియా ఘన విజయం సాధించి వరుసగా నాలుగోసారి ప్రపంచకప్‌నకు అర్హత పొందింది. జేజే స్మిత్ (61 నాటౌట్), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (55) రాణించడంతో నమీబియా 174/6 స్కోరు చేయగా, టాంజానియాను 111/8కే కట్టడి చేశారు. మరో సెమీఫైనల్‌లో కెన్యాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన జింబాబ్వే 2022 ప్రపంచకప్ తర్వాత తొలిసారి మెగా ఈవెంట్‌నకు అర్హత సాధించింది. బ్రియాన్ బెనెట్ (51), టడివనాషె మరుమని (39) ఓపెనింగ్‌లో 76 పరుగుల భాగస్వామ్యంతో కెన్యా నిర్దేశించిన 123 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే అధిగమించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ 20 జట్ల టోర్నీలో మిగతా మూడు స్థానాలను అక్టోబర్‌లో ఒమన్‌లో జరిగే క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు.