న్యూజిలాండ్ పర్యటనలో భారత ఫుట్‌బాల్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆక్లాండ్‌లోని గో మీడియా స్టేడియం (మౌంట్ స్మార్ట్) వేదికగా గురువారం జరిగిన తొలి అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆడిన న్యూజిలాండ్ (ఆల్ వైట్స్) 5-0 తేడాతో బ్లూ టైగర్స్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగం ముగిసేసరికే ఆతిథ్య జట్టు 3-0 ఆధిక్యంలో నిలిచింది.
గోల్స్ ఇలా..
- 5వ నిమిషం: భారత డిఫెండర్ బిజోయ్ వర్గీస్ సెల్ఫ్ గోల్‌తో న్యూజిలాండ్ ఖాతా తెరిచింది
- 34వ నిమిషం: జెస్సీ రాండాల్ గోల్
- 43వ నిమిషం: రాండాల్ రెండో గోల్
- 57వ నిమిషం: కాలన్ ఇలియట్ క్రాస్‌ను హెడర్‌తో గోల్‌గా మలిచిన కెప్టెన్ క్రిస్ వుడ్
- 74వ నిమిషం: లాక్లన్ బేలిస్ అద్భుత వాలీ
కైత్ పెనాల్టీ సేవ్ ఒక్కటే ఊరట
78వ నిమిషంలో న్యూజిలాండ్‌కు లభించిన పెనాల్టీని బిల్ టుయిలోమా తీయగా, భారత గోల్‌కీపర్ విశాల్ కైత్ అద్భుతంగా అడ్డుకున్నాడు. లేకపోతే ఓటమి తేడా మరింత పెరిగేది. భారత్ తరఫున 19వ నిమిషంలో మన్వీర్ సింగ్, ఆ తర్వాత కొలాకో ఫ్రీకిక్, 88వ నిమిషంలో టోంబా సింగ్ ప్రయత్నాలు గోల్‌గా మారలేదు.
2018 తర్వాత తొలిసారి థాపా సారథ్యం
ఈ మ్యాచ్‌లో అనిరుధ్ థాపా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2018 తర్వాత అతడు జట్టును నడిపించడం ఇదే తొలిసారి. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే హెడ్ కోచ్ ఖలీద్ జమీల్ ఒకేసారి ఐదుగురు ఆటగాళ్లను మార్చారు. జై గుప్తా, లాల్‌రిన్‌లియానా హ్నామ్టే, మెహతాబ్ సింగ్, రికీ మీతేయ్ హావోబమ్, మహమ్మద్ సుహైల్ మైదానంలోకి వచ్చారు. రికీ మీతేయ్ హావోబమ్, మహమ్మద్ సుహైల్, డేవిడ్ లాల్‌హ్లాన్‌సంగా, టోంబా సింగ్ హావోబమ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.







