మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాపూర్ పంచాయతీ కార్యదర్శి జె.వరలక్ష్మి రూ.13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్ చేసిన ఆమె, రూ.13 వేలకు బేరమాడినట్టు ఏసీబీ తెలిపింది. ఫోన్‌పే ద్వారా లంచం స్వీకరించే సమయంలోనే ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ జి.మధు నేతృత్వంలోని బృందం పట్టుకుంది. డిజిటల్ మాధ్యమాల ద్వారా లంచం తీసుకోవడం కూడా నేరమేనని, పౌరులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.