హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు శాంతిభద్రతల విభాగం డీజీపీగా ఉన్న ఆయన, వీసీ సజ్జనార్ స్థానంలో నగర పోలీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో ఆర్టీ నంబర్ 1654 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
సజ్జనార్‌కు అగ్నిమాపక శాఖ
1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సజ్జనార్ గతంలో టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై తరచూ ప్రజలను హెచ్చరిస్తూ ఆయన గుర్తింపు పొందారు. తాజా ఉత్తర్వులతో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా అనిల్ కుమార్ నియమితులయ్యారు.
కీలక బదిలీలు ఇవే
- చారు సిన్హా: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్
- ఎస్. చంద్రశేఖర్ రెడ్డి: ఏసీబీ డైరెక్టర్
- అకున్ సబర్వాల్: శాంతిభద్రతల అదనపు డీజీపీ; సమన్వయం, టెక్నికల్ సర్వీసెస్ (టీ-స్పార్క్) అదనపు బాధ్యతలు
- స్వాతి లక్రా: జైళ్ల శాఖ డీజీ
- సౌమ్య మిశ్రా: మహిళా భద్రతా విభాగం డీజీ
- విక్రమ్ సింగ్ మాన్: గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీ
- అనిల్ కుమార్: టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
- స్టీఫెన్ రవీంద్ర: టీజీ-టీమార్స్ (ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు, రైలు భద్రత) డైరెక్టర్
- కె. రమేశ్ నాయుడు: ఐజీ, రైల్వేస్
- కార్తికేయ: ఐజీ, మల్టీ జోన్–1
వీరితో పాటు జోయల్ డేవిస్‌ను టీజీ-టీమార్స్ జాయింట్ డైరెక్టర్ (రోడ్డు భద్రత)గా నియమించగా, ఆయన హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. కె. నారాయణ నాయక్‌ను జోన్–2 డీఐజీగా, జి. చందనా దీప్తిని జోన్–7 డీఐజీగా, ఎల్.ఎస్. చౌహాన్‌ను సమన్వయ విభాగం, జోన్–6 డీఐజీగా, ఆర్. భాస్కరన్‌ను ఇంటెలిజెన్స్ డీఐజీగా (పూర్తి అదనపు బాధ్యతలు), వి. అరవింద్ బాబును హైదరాబాద్ నగర డీసీపీగా నియమించారు.







