హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు భారీ ఆర్థిక ఊరటనిస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. విజయవాడ, న్యూఢిల్లీలోని స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ) సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం ప్రకారం మహిళల ప్రయాణ ఖర్చు 68 శాతం తగ్గింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ పథకాన్ని వినియోగిస్తున్న 410 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించారు.
అధ్యయనంలో కీలక అంశాలు
- సగటు ఒక్కో ప్రయాణ ఖర్చు రూ.30.4 నుంచి రూ.9.7కు తగ్గింది
- ప్రధానంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులు వాడే మహిళల వాటా 43.8% నుంచి 71.2%కు పెరిగింది
- సగటు ప్రయాణ దూరం 7.5 కి.మీ. నుంచి 8 కి.మీ.కు పెరిగింది
- సామాజిక అవసరాల ప్రయాణాలు 22.8%, ఆరోగ్య సంబంధిత ప్రయాణాలు 15.5% ఎక్కువ దూరం
- సర్వేలో పాల్గొన్నవారిలో 49% విద్యార్థినులు, సుమారు 63% మందికి సొంత వాహనం లేదు
ఆదాయ వర్గాల వారీగా ఆదా
నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల మహిళలకు సుమారు 73 శాతం, రూ.20,001–50,000 ఆదాయ వర్గానికి 69 శాతం, రూ.2 లక్షలకు పైగా ఆదాయ వర్గానికి 62 శాతం ఖర్చు ఆదా అయింది. 20 ఏళ్లలోపు యువతుల ప్రయాణ దూరం, తరచుదనం ఎక్కువగా పెరగగా.. 40 ఏళ్లు పైబడిన మహిళలు అత్యధికంగా ఆదా చేశారు. విద్యార్థినులు, అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా బస్సులవైపు మళ్లగా, గృహిణులకు ఖర్చు తగ్గడమే ప్రధాన ప్రయోజనంగా నిలిచింది.







