హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
కవిత ప్రధాన డిమాండ్లు
- గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగుస్తోంది.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు నమోదుకు అనుమతించాలి
- ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నవంబర్ 21 వరకు కొనసాగుతున్నందున ఈ వారమే నమోదు ముగించడం సరికాదు
- ప్రతి ఎన్నికకు ముందు కొత్తగా పట్టభద్రుల ఓటరు నమోదు చేయించడం అభ్యర్థులకు పెద్ద భారం.. ఈ విధానాన్ని మార్చాలని ఈసీని కోరతాం
- తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్లో ఉంది.. త్వరగా పూర్తయ్యేలా సహకరించాలి
విద్యాసంస్థల యజమానులపై ఆందోళన
పెద్ద విద్యాసంస్థల యజమానులు ఎమ్మెల్సీ బరిలోకి దిగుతూ తమ సంస్థల్లోనే పెద్ద ఎత్తున ఓటరు నమోదు చేయిస్తున్నారని, దీంతో ఎన్నికలు ఏకపక్షంగా మారుతున్నాయని కవిత ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. తమ సూచనను పరిశీలిస్తామని సీఈవో హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
కొత్త పార్టీలు తమ ఎజెండాను ప్రజల ముందుంచేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని, జెన్-జీ ఓటర్లు, పట్టభద్రులు ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుని ఓటు నమోదు చేసుకోవాలని కవిత పిలుపునిచ్చారు.







