తెలంగాణ వ్యాప్తంగా ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె మొదలుపెట్టారు. ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేలాది మంది డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డెక్కించకుండా నిరసన కొనసాగిస్తున్నారు.

గత మూడేళ్లలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించడం లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఏటా ప్రతి డ్రైవర్‌కు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సమ్మె కారణంగా నగరాలు, పట్టణాల్లో ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతుగా నిలవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.