స్లొవేకియా వేదికగా జరుగుతున్న అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ కజల్ ధోచక్ స్వర్ణ పతకం సాధించింది. 76 కేజీల విభాగంలో చైనాకు చెందిన జింగ్రూ సన్‌పై 7-0 తేడాతో ఘన విజయం సాధించి కజల్ అగ్రస్థానంలో నిలిచింది.
18 ఏళ్ల కజల్‌కు ఇది వరుసగా రెండో అండర్-20 ప్రపంచ టైటిల్. గతంలో 2024లో అండర్-17 ప్రపంచ చాంపియన్‌షిప్ (69 కేజీలు), 2025లో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ (72 కేజీలు) టైటిళ్లతో పాటు అండర్-23 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణం, ఈ ఏడాదే బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో స్వర్ణం సాధించింది.
అదే టోర్నీలో భారత్‌కు మరో రెండు రజత పతకాలు దక్కాయి. 72 కేజీల విభాగంలో తను శర్మ.. జపాన్‌కు చెందిన చిసాటో యోషిదా చేతిలో 3-5 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 62 కేజీల విభాగంలో సవిత.. జపాన్ రెజ్లర్ సకురా ఓనిషి చేతిలో టెక్నికల్ సుపీరియారిటీతో 2-12 తేడాతో పరాజయం పాలై రజతం దక్కించుకుంది. మహిళల 57, 59, 68 కేజీల విభాగాలతో పాటు పురుషుల ఫ్రీస్టయిల్ 61, 86 కేజీల పోటీలు ఇంకా జరగాల్సి ఉంది.







