సంగారెడ్డి: దేశంలో అణు విద్యుత్ రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేసే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఈఈపీఎల్) సంయుక్తంగా చేపట్టిన 'అనుజ్ఞాన్ – న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్' తొలి బ్యాచ్ పూర్తయింది. సంగారెడ్డిలోని ఐఐటీహెచ్ క్యాంపస్లో ఆగస్టు 3న ప్రారంభమైన ఈ 12 వారాల పూర్తి రెసిడెన్షియల్ కార్యక్రమంలో 23 మంది ఇంజినీర్లు, పరిశ్రమ నిపుణులు శిక్షణ పొందారు.
శిక్షణలో అంశాలు
- రియాక్టర్ ఫిజిక్స్, థర్మల్ హైడ్రాలిక్స్, రేడియేషన్ షీల్డింగ్
- స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్), అణు భద్రత, నాణ్యత ప్రమాణాలు
- అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) నియంత్రణ వ్యవస్థ
- ల్యాబ్ ప్రయోగాలు, అణు విద్యుత్ కేంద్రం సిమ్యులేటర్ శిక్షణ, బార్క్, ఎన్పీసీఐఎల్ నిపుణుల అనుభవాలు
ఎందుకీ కార్యక్రమం?
దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని ప్రస్తుత సుమారు 8.8 గిగావాట్ల నుంచి 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో డిజైన్, తయారీ, నిర్మాణం, నిర్వహణ, భద్రత రంగాల్లో శిక్షణ పొందిన నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది. 24 గంటలూ నిరంతర స్వచ్ఛ విద్యుత్ కోసం అణు విద్యుత్ కీలకమని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) చైర్పర్సన్ ఘనశ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యాపరమైన పునాదిని పరిశ్రమ అవసరాలతో అనుసంధానించేలా అనుజ్ఞాన్ను రూపొందించామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి తెలిపారు.







