హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను పట్టుకున్నా, బంధించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలకు సందేశం ఇచ్చారు.
సెంటిమెంట్ పేరుతో బంధించొద్దు
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకంతో కొందరు ఈ పక్షులను పట్టుకుని పంజరాల్లో బంధించి, వాటితో వ్యాపారం చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ రైతులకు మేలు చేసే పాలపిట్టను హింసించడం తగదని అన్నారు.
చట్ట ప్రకారం నేరం
"వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 ప్రకారం పాలపిట్టలను పట్టుకోవడం, అమ్మడం, ప్రదర్శించడం క్రిమినల్ నేరం" అని సజ్జనార్ స్పష్టం చేశారు. ఎక్కడైనా పాలపిట్టలను బంధించినట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.







