హైదరాబాద్ ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగుల కోసం నడుస్తున్న అనేక పేయింగ్ గెస్ట్ వసతి గృహాలు, హాస్టళ్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని పరిశీలనలో వెల్లడైంది. అగ్నిమాపక భద్రత, అత్యవసర నిష్క్రమణ మార్గాలు లేని భవనాల్లోనే వందలాది మంది నివసిస్తున్నట్టు గుర్తించారు.
ఇటీవల జరిగిన భవన ప్రమాదాల నేపథ్యంలో ఇలాంటి వసతి గృహాలపై అధికారుల దృష్టి పడింది. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని నివాసితులు, ఐటీ ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి.
భద్రతా ప్రమాణాలు పాటించని హాస్టళ్లపై త్వరలో తనిఖీలు చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.







