ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్స్ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కొన్ని పాఠశాలలకు యూనిఫామ్స్ ఇంకా అందకపోగా, అందినవి కూడా సరైన కొలతలు లేకుండా, కుట్టు నాణ్యత సరిగా లేకుండా ఉన్నాయని ఆరోపించారు.

ఉతికిన వెంటనే రంగు వెలిసిపోతున్న యూనిఫామ్స్‌ను సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను నిరాశపరిచిందని హరీశ్‌రావు అన్నారు. స్థానిక చేనేత కార్మికులను పక్కనబెట్టి పెద్ద కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు.

"ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం యూనిఫామ్స్ ఇచ్చి, చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది" అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. యూనిఫామ్స్ కొనుగోలు ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు.