హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కుతుబ్షాహీ సమాధుల సమీపంలో ఓ గుప్త సొరంగం బయటపడింది. అథార్ సీడీ ప్రాంతంలో, 400 ఏళ్ల నాటి కుతుబ్షాహీ టూంబ్స్కు ఆనుకుని ఉన్న ఒక ప్లేగ్రౌండ్ వద్ద గురువారం తవ్వకాలు జరుపుతుండగా ఈ సొరంగం బయటపడింది.
విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్.. వెంటనే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) దృష్టికి తీసుకెళ్లి, ప్రాంతాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సొరంగం వయసు, దాని ప్రయోజనం, విస్తీర్ణం వంటి అంశాలపై అధ్యయనం చేసి.. ఇది నిజమైన చారిత్రక మార్గమా లేక ఇటీవలి తవ్వకమా అనేది నిర్ధారించనున్నట్టు అధికారులు తెలిపారు. భద్రత దృష్ట్యా ప్రాంతంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
గోల్కొండ కోట నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు రహస్య మార్గాలు ఉన్నాయన్న ఐతిహ్యం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. యుద్ధ సమయాల్లో తప్పించుకునేందుకు ఇలాంటి సొరంగాలను నిర్మించి ఉంటారని చరిత్రకారుల అంచనా. అయితే గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు సుదూర సొరంగం ఉందన్న వాదనకు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదు. గతంలో ఇలాంటి అనుమానాస్పద నిర్మాణాలు డ్రైనేజీ కాలువలు లేదా నేలమాళిగలుగా తేలిన సందర్భాలు ఉన్నాయి. అనుమతి లేకుండా తవ్వకాలు జరిపారన్న ఆరోపణలపైనా ఏఎస్ఐ దృష్టి సారించనుంది.






