మైనర్లకు నిషేధిత వేప్‌ల విక్రయం.. ఇద్దరు అరెస్టు, 31 ఈ-సిగరెట్లు స్వాధీనం
కోల్‌కతా నుంచి కొరియర్ ద్వారా ఈ-సిగరెట్లు తెప్పించి హైదరాబాద్, కరీంనగర్‌లో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ బృందం ఛేదించింది. ఇద్దరిని అరెస్టు చేసి 31 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.
నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ సరఫరాపై తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఉక్కుపాదం మోపింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్ మీదుగా కరీంనగర్ వరకు విస్తరించిన ఈ-సిగరెట్ల సరఫరా ముఠాను ఛేదించి ఇద్దరిని అరెస్టు చేసింది. మొత్తం 31 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది.
కరీంనగర్ కేఫ్ నుంచి మొదలు
కరీంనగర్‌లోని ఓ హోటల్ అండ్ కేఫ్‌లో మైనర్‌కు ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రం (ఆర్ఎన్‌సీసీ) బృందం నవంబర్ 12న దాడి చేసింది. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 12 ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతనికి సరఫరా చేస్తున్నది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తేలింది.
చార్మినార్ ఫుట్‌పాత్ వ్యాపారి కీలకం
ఆసిఫ్ ఇచ్చిన సమాచారంతో నవంబర్ 14న హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ ప్రాంతంలో రాహిల్ ఖాన్ అలియాస్ ఒమర్ (26)ను అరెస్టు చేశారు. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ఎదుట ఫుట్‌పాత్‌పై దుస్తులు విక్రయించే అతను గతంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 19 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
దందా సాగిందిలా..
- కోల్‌కతాలోని ఓ దుకాణం నుంచి కొరియర్ ద్వారా క్రమం తప్పకుండా వేప్‌లు తెప్పించేవాడు.
- అనుమానం రాకుండా వేర్వేరు పేర్లు, పలు మొబైల్ నంబర్లతో ఆర్డర్లు పెట్టేవాడు.
- ఒక్కో విడతలో సుమారు 20 చొప్పున కనీసం ఏడు సరుకులు అందుకున్నాడు. చివరి సరుకు అక్టోబర్ 22న వచ్చింది.
- చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా జరిగాయి.
- హైదరాబాద్ ఫీల్‌ఖానాలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ద్వారా 20 సార్లకు పైగా కరీంనగర్‌కు సరుకు పంపాడు.
రాహిల్ ఖాన్‌పై 2024లోనూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇదే తరహా కేసు నమోదై ఉండటం గమనార్హం. మీర్‌చౌక్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. నిందితుల ఫోన్లు, బ్యాంకు, డిజిటల్ చెల్లింపుల రికార్డులు, కొరియర్ వివరాలను విశ్లేషించి కోల్‌కతా సరఫరాదారుతో సహా పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో ఈగల్ అధికారులు ఉన్నారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం–2019 ప్రకారం ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి, రవాణా, విక్రయం, నిల్వ, ప్రకటనలు పూర్తిగా నిషేధం. పిల్లలు, యువత వీటికి అలవాటు పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వరుస దాడులు
నగరంలో ఈ-సిగరెట్ల విక్రయాలపై ఈగల్ గత రెండు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. అక్టోబర్ 28న నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రి సమీపంలోని ఓ దుకాణంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు రూ.1.05 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. అంతకుముందు సైనిక్‌పురిలో 39 ఈ-సిగరెట్లు, మాదాపూర్‌లో 92 వేప్‌లను పట్టుకుంది. విద్యాసంస్థల పరిసరాల్లో, సోషల్ మీడియా ద్వారా ఈ-సిగరెట్లు అమ్ముతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ-సిగరెట్లలోని నికోటిన్ త్వరగా వ్యసనానికి దారితీస్తుందని, టీనేజర్ల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.