హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రారంభించిన సామాజిక భద్రత, సంక్షేమ పథకంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో శనివారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఈ పథకాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామన్న హామీ ‘పెద్ద జోక్’ అని, రాహుల్ గాంధీ మాటలన్నీ ఉత్తవేనని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి?
గత ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ అమలు కాలేదని బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్న హామీని కూడా గాలికొదిలేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత ఇస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు.
బోర్డుకు నిధులు ఎక్కడివి?
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని, అయితే దానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న సంక్షేమ బోర్డులకే సర్కారు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కోసం రాజస్థాన్ తరహా సామాజిక భద్రత చట్టం తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందని గుర్తుచేశారు. రాజస్థాన్‌లో బోర్డుకు నిధులు కేటాయించడంతో పాటు అగ్రిగేటర్ సంస్థల లావాదేవీలపై సంక్షేమ రుసుము వసూలు చేస్తున్నారని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉందని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు భారీ జరిమానాలు విధిస్తున్నారని వివరించారు. తెలంగాణలోనూ అదే స్థాయిలో అమలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.







