హైదరాబాద్‌లోని అంజయ్య నగర్‌లో ఆదివారం ఏడంతస్తుల అక్రమ భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన సర్కారును కదిలించింది. ఈ ప్రమాదం అనంతరం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అక్రమ నిర్మాణాలపై ముమ్మర తనిఖీలు చేపట్టింది. మంగళవారం సెరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కూత్బుల్లాపూర్ జోన్లలో మొత్తం 17 అక్రమ భవనాలను నేలమట్టం చేసింది.

జోన్ల వారీగా చూస్తే సెరిలింగంపల్లిలో 7, కూకట్‌పల్లిలో 2, కూత్బుల్లాపూర్‌లో 8 భవనాలను కూల్చివేశారు. అదనంగా 11 అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేయగా, వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మరో 54 అక్రమ కట్టడాలను గుర్తించారు.

ఈ ఘటనలో భవన యజమాని సయ్యద్ సాజిద్‌ను సోమవారమే పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న కాంట్రాక్టర్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో నిఘా పెంచి, తొలిదశలోనే అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని సీఎంసీ కమిషనర్ జి.శ్రీజన అధికారులను ఆదేశించారు. 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాలు ఎలా నిర్మించారన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.