హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి కాకతీయ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం' పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో పాల్గొంటారు.
పర్యటన షెడ్యూల్
- మధ్యాహ్నం 2 గంటలు – బేగంపేట విమానాశ్రయానికి రాక, కాకతీయ హోటల్‌కు
- మధ్యాహ్నం 2–4 గంటలు – రిజర్వ్ సమయం; రాష్ట్ర ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం
- సాయంత్రం 4 గంటలు – బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి మహా పాదయాత్ర
- ఎంజే మార్కెట్ (మొజాంజాహీ మార్కెట్) చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్
ఎస్ఐఆర్పై కాంగ్రెస్‌కు కౌంటర్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. పాదయాత్ర ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించిన మరుసటి రోజే అమిత్ షా హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పాదయాత్ర నేపథ్యంలో బషీర్‌బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.







