రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేశని శ్రీనివాస రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన మరో ఐదు చోట్ల మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

ఈ దాడుల్లో మొత్తం రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. వీటిలో కర్మన్‌ఘాట్‌లో రెండు నివాస ఫ్లాట్లు (రూ.2.63 కోట్లు), సరూర్‌నగర్‌లో 233 గజాల విస్తీర్ణంలో జి3 పెంట్‌హౌస్‌ (రూ.1.61 కోట్లు), నల్లావెల్లిలో 10 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమి (రూ.25.50 లక్షలు), ఎనిమిది ఖాళీ ప్లాట్లు (రూ.62.84 లక్షలు), నరేంద్ర బార్‌ రెస్టారెంట్‌లో పెట్టుబడి (రూ.86 లక్షలు) ఉన్నాయి. వీటితో పాటు రూ.4 లక్షల నగదు, రూ.8.60 లక్షల బ్యాంకు నిల్వలు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.5.85 లక్షలు), మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు (రూ.59 లక్షలు), గృహోపకరణాలు (రూ.11 లక్షలు) కూడా లభించాయి.

శ్రీనివాస రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం ఇది రెండోసారి. ఆయన గతంలో మహేశ్వరం మండలంలో పనిచేస్తున్న సమయంలో 2009 డిసెంబరు 14న తొలిసారి ఈ తరహా కేసు నమోదైంది.