విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం రాత్రి సుమారు 9.50 గంటలకు పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. ఇటీవల విస్తరించిన రిఫైనరీ ప్రాజెక్టులోని టార్ పిచ్ యూనిట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని మల్కాపురం సీఐ ఇ.నరసింహారావు తెలిపారు.
ఏం జరిగింది?
- పిచ్ ఇంటర్మీడియట్ స్టోర్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది
- సంస్థ ఫైర్ అండ్ సేఫ్టీ బృందం వెంటనే అత్యవసర చర్యలు చేపట్టింది.. పొరుగు పరిశ్రమల అగ్నిమాపక బృందాలు కూడా సహకరించాయి
- మంటలు పిచ్ ట్యాంక్ ప్రాంతానికే పరిమితమయ్యాయని, కొద్దిసేపట్లోనే అదుపులోకి వచ్చాయని హెచ్‌పీసీఎల్ వెల్లడి
- రిఫైనరీలోని అన్ని యూనిట్లు సురక్షితంగా పనిచేస్తున్నాయని సంస్థ స్పష్టీకరణ
- పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ టెర్మినల్ వద్ద ముందు జాగ్రత్త చర్యలు
స్థానికుల్లో భయాందోళన
మంటల నుంచి వెలువడిన నల్లటి పొగ శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట చిమ్నీ నుంచి వచ్చే మంటలుగా భావించామని, ప్రమాద సమయంలో అత్యవసర సైరన్లు మోగించలేదని కొందరు స్థానికులు ఆరోపించారు. అర్ధరాత్రి తర్వాత మంటలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకోగా, వెస్ట్ జోన్ ఏసీపీ ప్రదీప్తి రిఫైనరీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.







