తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియడంతో ఆలయ పాలన బాధ్యతలను స్పెసిఫైడ్ అథారిటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ (దేవాదాయ) శాఖ నవంబర్ 2న జీవో ఎంఎస్ నంబర్ 658 విడుదల చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
అథారిటీ సభ్యులు
- చైర్మన్: టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ముద్దాడ రవిచంద్ర
- సభ్యులు: ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) కె. కన్నబాబు
ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులను ఈ అథారిటీ నిర్వహిస్తుంది. కొత్త పాలక మండలి ఏర్పడే వరకు లేదా ఏడాది పాటు, ఏది ముందైతే అది వర్తిస్తుంది.
నేపథ్యం
కూటమి ప్రభుత్వం 2024 నవంబర్ 1న జీవో 243 ద్వారా బీఆర్ నాయుడును చైర్మన్‌గా నియమిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. ఆయన అదే నెల 6న బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ చట్టం ప్రకారం మండలి పదవీకాలం రెండేళ్లు కావడంతో అక్టోబర్ 31తో అది ముగిసింది. టీటీడీ చట్టంలో పదవీకాలం పొడిగింపునకు అవకాశం లేదు.







