భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) పరిధిలోని పలు విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపాదించిన 11 విమానాశ్రయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విమానాశ్రయం కూడా చోటు దక్కించుకుంది.
ప్రయాణికుల రద్దీ, రెవెన్యూ వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రైవేటు నిర్వహణ వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా.
అయితే ఈ ప్రతిపాదనపై స్థానిక రాజకీయ పక్షాల నుంచి భిన్నస్పందనలు వ్యక్తమవుతున్నాయి. తుది నిర్ణయం, ప్రక్రియ విధివిధానాలపై కేంద్రం త్వరలో స్పష్టత ఇవ్వనుంది.







