తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో వైభవంగా ముగిశాయి. అన్ని విభాగాల సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో కేవీ మురళీకృష్ణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బ్రహ్మోత్సవాల గణాంకాలు (అక్టోబర్ 12-19)
- శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 6.46 లక్షలు
- హుండీ కానుకలు: రూ.25.79 కోట్లు
- తలనీలాలు సమర్పించిన భక్తులు: సుమారు 2.44 లక్షలు
- అన్నప్రసాదం ప్యాకెట్ల పంపిణీ: 22.60 లక్షలు
- లడ్డూ విక్రయాలు: 34.34 లక్షలు
రవాణా ఏర్పాట్లు
ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతి నుంచి తిరుమలకు 13,608 ట్రిప్పుల్లో 4.01 లక్షల మంది భక్తులను, తిరుగు ప్రయాణంలో 13,667 ట్రిప్పుల్లో సుమారు 5 లక్షల మందిని చేరవేసింది. టీటీడీ రవాణా విభాగం 39 ఎలక్ట్రిక్ బస్సులతో సుమారు 6,900 ట్రిప్పుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులకు సేవలందించింది.
కళా ప్రదర్శనలు, అలంకరణలు
దేశంలోని 26 రాష్ట్రాలతో పాటు ఖతార్, దుబాయ్ నుంచి వచ్చిన 252 బృందాలకు చెందిన 6,777 మంది కళాకారులు వాహన సేవల ముందు ప్రదర్శనలిచ్చారు. గరుడ సేవ రోజున 17 రాష్ట్రాలకు చెందిన 31 బృందాల్లో 863 మంది కళాకారులు పాల్గొన్నారు. పుష్పాలంకరణకు సుమారు 60 టన్నుల పూలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. 36 భారీ డిజిటల్ తెరల ద్వారా వాహన సేవలను ప్రదర్శించగా, ఎస్వీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.







