తిరుమల: తిరుమల గిరులపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమల కొండలు చల్లబడ్డాయి. శ్రీవారి ఆలయం, మాడ వీధుల పరిసరాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
చలితో భక్తుల ఇబ్బందులు
వర్షం, చలి గాలుల కారణంగా దర్శనానికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ చాలా మంది భక్తులు పొగమంచుతో కప్పబడిన సప్తగిరుల సుందర దృశ్యాలను, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఘాట్ రోడ్లలో జాగ్రత్త: టీటీడీ
వర్షం, పొగమంచు కారణంగా దారి సరిగా కనిపించని పరిస్థితి ఉన్నందున ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూచించింది. వాహనదారులు వేగం తగ్గించి నెమ్మదిగా ప్రయాణించాలని కోరింది.







