నెల్లూరు: తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ హనుమంతు, ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాళ్లపల్లి సమీపంలో 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 14) వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చిన స్కూల్ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజీవ్ హనుమంతుతో పాటు కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
తిరుమల నుంచి శ్రీశైలం వెళ్తుండగా
2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ హనుమంతు ప్రస్తుతం తెలంగాణలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని శ్రీశైలం వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హనుమంతుకు తీవ్ర గాయాలు కాగా, ఆయన పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. స్కూల్ వ్యాన్‌లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆత్మకూరు నుంచి నెల్లూరుకు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హనుమంతు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.







