విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన ప్రతిష్ఠాత్మక సైనిక్ స్కూల్ కోరుకొండ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ (ఎన్డీఏ/ఎన్ఏ) రాత పరీక్ష ఫలితాల్లో దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో అత్యధిక మంది అర్హత సాధించిన పాఠశాలగా నిలిచింది.
ఫలితాలు ఇలా
- ప్రస్తుత 12వ తరగతి బ్యాచ్: 78 మంది క్యాడెట్లలో 41 మంది అర్హత (52.56 శాతం విజయం)
- గత బ్యాచ్‌కు చెందిన మరో 13 మంది క్యాడెట్లు 158వ కోర్సుకు అర్హత
- మొత్తం విజేతలు: 54 మంది
ప్రస్తుత బ్యాచ్‌లో సగానికి పైగా క్యాడెట్లు ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించడం వరుసగా ఇది రెండో సంవత్సరం కావడం విశేషం.
ప్రిన్సిపాల్ అభినందనలు
విజేతలైన క్యాడెట్లను పాఠశాల ప్రిన్సిపాల్ గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి అభినందించారు. క్యాడెట్ల పట్టుదల, క్రమశిక్షణ వల్లే ఈ ఘనత సాధ్యమైందని కొనియాడారు. వింగ్ కమాండర్ కిరణ్ వి. నేతృత్వంలోని శిక్షణ బృందం, అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన క్యాడెట్లు తదుపరి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు.







