తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన యూకే-అమెరికా పర్యటనలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. అమెరికాలో నిర్వహించాల్సిన 'తెలంగాణ రైజింగ్' సమావేశాలకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో ఆ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. లండన్, అమెరికాలలో 'తెలంగాణ రైజింగ్' పేరుతో పెట్టుబడుల సదస్సులు నిర్వహించాలని సీఎం ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా బోస్టన్, న్యూయార్క్‌లలో పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ కూడా సిద్ధం చేసింది. అయితే చివరి నిమిషంలో యూకేలో జరిగే సమావేశాలకు మాత్రమే కేంద్రం అనుమతి ఇవ్వగా, అమెరికా భేటీలకు గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో పర్యటనను కుదించుకుని సీఎం ఈ నెల 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. రద్దయిన అమెరికా పర్యటనను వచ్చే నెలలో చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి స్వయంగా వెళ్లకుండా అధికారుల బృందాన్ని పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై స్పందించిన రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 'తెలంగాణ రైజింగ్' ప్రయాణం ఆగదని ధీమా వ్యక్తం చేశారు.