అనంతపురం: రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే చైన్సాతో దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించారని, స్పృహలోకి వచ్చి చికిత్సకు స్పందిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. కోలుకుంటున్న విద్యార్థిని తన టీచర్ గురించి అడిగిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
12 గంటల శస్త్రచికిత్స
తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వరుసగా 12 గంటల పాటు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఐసీయూకు మార్చారు. నవంబర్ 1న ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడిన లోకేశ్, ఇన్ఫెక్షన్ ముప్పు దృష్ట్యా 48 గంటలు కీలకమని చెప్పారు. బాలికను సొంత కూతురిలా కాపాడే బాధ్యత తీసుకుంటానని, నిందితుడి నేపథ్యం ఏదైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్
- 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల బృందం పదో తరగతి 'ఏ' సెక్షన్‌లోని 32 మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మాట్లాడుతోంది.
- 8, 9, 10 తరగతుల విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకూ ధైర్యం చెబుతున్నారు.
- విద్యార్థులు ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కనీసం ఏడాది పట్టొచ్చని, అందుకే దీర్ఘకాలిక కౌన్సెలింగ్ కార్యక్రమం అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు.







