న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్న వేళ పునరుత్పాదక ఇంధనం మరింత కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో 2026ను ఆయన ప్రారంభించారు. ఇంధన భద్రత ఆర్థిక భద్రతతో ముడిపడి ఉందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థలను పదేపదే కుదుపులకు గురిచేస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని సూచనలు
- రోజంతా, అన్ని వాతావరణాల్లో నమ్మకమైన విద్యుత్ ఇచ్చే సౌర వ్యవస్థల రూపకల్పనకు స్టార్టప్‌లు, ఐఐటీలు, పరిశోధకులు కృషి చేయాలి
- రూఫ్‌టాప్ సోలార్ వంట, ఎలక్ట్రిక్ వాహనాలకు సోలార్ ఛార్జింగ్‌తో మధ్యతరగతి కుటుంబాలు ఏటా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు
మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన గణాంకాలు
- శిలాజేతర ఇంధన సామర్థ్యం: 80.3 గిగావాట్ల నుంచి 310 గిగావాట్లకు (12 ఏళ్లలో)
- సౌర విద్యుత్: 2.8 నుంచి 171 గిగావాట్లు | పవన విద్యుత్: 21 నుంచి 60 గిగావాట్లు
- సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 2 నుంచి 225 గిగావాట్లకు
- గత రెండేళ్లలో పునరుత్పాదక రంగంలోకి 67 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు
- పీఎం సూర్య ఘర్ పథకంలో 65 లక్షలు దాటిన ఇన్‌స్టలేషన్లు
- సౌర విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.10–11 నుంచి రూ.2.15కు తగ్గింది
కొత్త పథకాలకు ఆమోదం
5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ లక్ష్యంతో రూ.5,000 కోట్లకు పైగా వ్యయంతో 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన', రూ.1.86 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశకు ఆమోదం లభించినట్లు మంత్రి తెలిపారు.







