‘మేక్ ఇండియా యువర్ అడ్రస్’ అంటూ ప్రపంచ సంస్థలకు పిలుపు.. పెట్టుబడిదారుల్లో నమ్మకం నింపడంలో చంద్రబాబు మాస్టర్ అని ప్రశంస
ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న వేళ పెట్టుబడిదారులకు భారత్ ఎడారిలో ఒయాసిస్సు లాంటిదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో విధానాల స్థిరత్వం, న్యాయమైన చట్టాలు, పెట్టుబడుల భద్రతపై భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
విశాఖపట్నం: యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితితో ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న వేళ పెట్టుబడిదారులకు భారత్ ఎడారిలో ఒయాసిస్సు లాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో గురువారం ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మీ తదుపరి ఫ్యాక్టరీ, పరిశోధన కేంద్రం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా డిజైన్ సెంటర్‌కు భారత్‌నే చిరునామాగా చేసుకోవాలని (మేక్ ఇండియా యువర్ అడ్రస్) ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
పెట్టుబడిదారులకు మూడు హామీలు
అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ మూడు ప్రధాన హామీలు ఇస్తోందని గోయల్ చెప్పారు. అవి.. విస్తృత మార్కెట్లు, సామర్థ్యం, విశ్వసనీయత. ప్రపంచంలో ఎలాంటి తుపాను వచ్చినా, ఎన్ని యుద్ధాలు, ఘర్షణలు జరిగినా భారత విధానాలు స్థిరంగా ఉంటాయని, చట్టాలు న్యాయబద్ధంగా ఉంటాయని, పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
- భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ జీడీపీ 115 ట్రిలియన్ డాలర్లలో దాదాపు 85 ట్రిలియన్ డాలర్ల వాటా ఉన్న దేశాల మార్కెట్లు భారత ఉత్పత్తులు, సంస్థలు, నిపుణులకు అందుబాటులోకి వస్తాయి.
- యూరప్, అమెరికా, కెనడాలతో పోలిస్తే ఐదో వంతు లేదా ఆరో వంతు ఖర్చుతోనే భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సాధ్యమవుతుంది.
- భారత్ మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తుంది; ఎవరి సాంకేతికతనూ దొంగిలించదు.
20వ శతాబ్దాన్ని తక్కువ ఖర్చు (కాస్ట్ ఆర్బిట్రేజ్) శాసిస్తే, 21వ శతాబ్దాన్ని నమ్మకం (ట్రస్ట్ ఆర్బిట్రేజ్) నిర్దేశిస్తుందని గోయల్ వ్యాఖ్యానించారు. ఎవరు చౌకగా తయారు చేస్తారన్నది కాదు, ఎవరు నమ్మకంగా అందిస్తారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న అని అన్నారు. ఫ్యాక్టరీలు, హోటళ్లు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్య దేశాలను కోరారు. దేశంలోని 2.5 లక్షల స్టార్టప్‌లకు ఇది భారీ అవకాశమని, దేశీయ పరిశ్రమలు సుస్థిరత, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ నిపుణులు సాధిస్తున్న విజయాలు వ్యక్తిగత ఘనత మాత్రమే కాదని, దేశ వృద్ధికి, శ్రేయస్సుకు అవి అవకాశాలని గోయల్ అన్నారు. భారత్ ఎదిగితే ప్రపంచానికి కొత్త అవకాశాలు దొరుకుతాయని వ్యాఖ్యానించారు.
స్టీల్ నుంచి సిలికాన్ వైపు విశాఖ
భారత సామర్థ్యానికి ఉదాహరణగా గోయల్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తావించారు. విశాఖపట్నం స్టీల్ సిటీ నుంచి సిలికాన్ సిటీగా ఎదుగుతోందని, ఓర్వకల్లు వద్ద డ్రోన్ సిటీ, తిరుపతి వద్ద స్పేస్ సిటీ, పూడిమడక వద్ద దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
చంద్రబాబుపై ప్రశంసలు
భవిష్యత్ రంగాలను ముందుగానే గుర్తించి ప్రాధాన్యం ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని, పెట్టుబడిదారుల్లో నమ్మకం నింపడంలో ఆయన మాస్టర్ అని గోయల్ కొనియాడారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు కోసం ఎస్క్రో ఖాతాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని, ఇతర రాష్ట్రాలకూ ఇది ఆదర్శమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఇద్దరు కథానాయకులతో పోలుస్తూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇదే వేదికపై చంద్రబాబు మాట్లాడుతూ, 2024 జూన్ నుంచి రాష్ట్రం రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. దేశం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం పెట్టుకోగా, అందులో 160 గిగావాట్లను ఆంధ్రప్రదేశ్ అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ వ్యాలీ, తిరుపతిలో స్పేస్ సిటీ, డ్రోన్ ఎయిర్ ట్యాక్సీలు వంటి ప్రాజెక్టులు రానున్నాయని వివరించారు. పెట్టుబడిదారులకు మరింత భరోసా ఇచ్చేలా పెట్టుబడుల రక్షణ చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు. అంతకుముందు గోయల్, చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్లను ప్రారంభించి స్టాళ్లను సందర్శించారు. అరకు కాఫీ రుచి చూశారు.
58 దేశాల ప్రతినిధులు
‘నావిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ థాట్ లీడర్షిప్’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సుకు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు. యూఏఈ, సింగపూర్, కెనడా, స్లొవేకియా, నేపాల్, మారిషస్ తదితర దేశాల మంత్రులు ప్రత్యేక మంత్రుల ప్లీనరీలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ముగింపు సమావేశానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.