న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్ అక్టోబర్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీల నుంచి డీలర్లకు పంపిన ప్యాసింజర్ వాహనాల (పీవీ) డిస్పాచ్‌లు తొలిసారిగా 5 లక్షల యూనిట్ల మార్కును దాటాయి. అంచనాల ప్రకారం మొత్తం డిస్పాచ్‌లు 5.25 నుంచి 5.3 లక్షల యూనిట్ల మధ్య ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో నమోదైన సుమారు 4.6 లక్షలతో పోలిస్తే ఇది 13 నుంచి 15 శాతం వృద్ధి.

కంపెనీల వారీగా దేశీయ డిస్పాచ్‌లు

  • మారుతి సుజుకి: 2.12 లక్షల యూనిట్లు (20.5% వృద్ధి)
  • టాటా మోటార్స్: 73,894 యూనిట్లు (21% వృద్ధి)
  • మహీంద్రా అండ్ మహీంద్రా: 73,338 యూనిట్లు (2% వృద్ధి)
  • హ్యుందాయ్: 62,799 యూనిట్లు (16.7% వృద్ధి)

వృద్ధికి కారణాలు

పండుగ సీజన్ డిమాండ్, తగ్గిన రుణ వడ్డీ రేట్లు, పన్ను సంస్కరణలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ధన్‌తేరస్, దీపావళి కోసం డీలర్లు ముందుగానే భారీగా స్టాక్ సమకూర్చుకున్నారు. మారుతి అక్టోబర్‌లో దాదాపు 2.6 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. అయితే దీపావళి సెలవుల కారణంగా నవంబర్‌లో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు 3.5 లక్షలు దాటి రికార్డు సృష్టించాయి.