బెంగళూరు/అమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో జరిగిన రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం శుభవార్త చెప్పారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంలో స్థిరమైన పురోగతి కనిపిస్తోందని వైద్యుల బృందం తెలిపినట్లు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
లోకేశ్ ఇచ్చిన అప్డేట్
- బాలిక స్పృహలోకి వచ్చింది, ఆమె తల్లి చూసి వచ్చారు
- పరిస్థితి మెరుగుపడుతుండటంతో సోమవారం సాయంత్రం వెంటిలేటర్ సపోర్ట్ తొలగించాలని వైద్యులు భావిస్తున్నారు
- ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు రెండూ విజయవంతమయ్యాయి
- ప్రస్తుతం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో నిశిత పర్యవేక్షణలో ఉంది
ఆస్పత్రికి వెళ్లి పరామర్శ
ఆదివారం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన లోకేశ్ పీఐసీయూలో బాలికను చూసి, వైద్యులతో చికిత్స వివరాలపై మాట్లాడారు. తదుపరి 48 గంటలు అత్యంత కీలకమని అప్పట్లో ఆయన తెలిపారు. బాలిక త్వరగా కోలుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ ప్రార్థించాలని కోరారు. ఘటన జరిగిన తీరుపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు.
"ఇది అత్యంత దురదృష్టకర ఘటన, దీన్ని రాజకీయం చేయొద్దు" అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. బాలిక చికిత్స, పునరావాసానికి అవసరమైన పూర్తి సహాయం ప్రభుత్వం అందిస్తుందని, కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడి ప్రభావం నుంచి తోటి విద్యార్థులు మానసికంగా బయటపడేందుకు కనీసం ఏడాది పట్టవచ్చని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. కాగా, ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.







