తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం పలు విమానాలను దారి మళ్లించగా, మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.
మంత్రుల విమానం నాగ్‌పూర్‌కు
విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 1373 విమానాన్ని భోగాపురం విమానాశ్రయంలో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మళ్లించారు. ఈ విమానంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ప్రయాణిస్తున్నారు.
దారి మళ్లిన, రద్దయిన విమానాలు
- విశాఖపట్నం–విజయవాడ ఇండిగో విమానాన్ని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.
- హైదరాబాద్–రాజమహేంద్రవరం స్టార్ ఎయిర్ విమానం (591)ను బెంగళూరుకు మళ్లించారు. పలు స్టార్ ఎయిర్ సర్వీసులు రద్దయ్యాయి.
- చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లాల్సిన ఇండిగో విమానం విజయవాడ నుంచే వెనుదిరిగింది.
- విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు.
వాతావరణం మెరుగుపడే వరకు
వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ఆయా మార్గాల్లో సేవలు నిలిచిపోతాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థల నుంచి విమాన స్థితిని తెలుసుకోవాలని సూచించారు.







