అమరావతి: బంగారం అక్రమ రవాణా ముఠాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ శివార్లలో నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఆర్‌ఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఎస్‌యూవీలో రహస్య అర
ఒక స్మగ్లింగ్ ముఠాపై అందిన నిఘా సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్, విజయవాడ రీజనల్ యూనిట్ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. విజయవాడ శివార్లలో ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్‌యూవీ) అడ్డగించి తనిఖీ చేయగా, వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో దాచిన విదేశీ కరెన్సీ బయటపడింది. నగర శివార్లలో బంగారాన్ని అందజేశామని, ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బే ఇదని వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అధికారులకు చెప్పినట్లు సమాచారం.
బస్సులో మరో ముగ్గురు
ఆ సమాచారం ఆధారంగా హైదరాబాద్ వెళ్తున్న ఒక బస్సును టోల్ ప్లాజా వద్ద అడ్డగించిన అధికారులు మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నడుముకు కట్టుకున్న సంచి నుంచి విదేశీ మూలానికి చెందిన మూడు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.







